పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ

పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ

  • ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన అధికారులు

కారేపల్లి, ఆంధ్రప్రభ : కారేపల్లి మండలం, వెంకట్యా తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. “కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం..?” అనే శీర్షికతో వెలువడిన కథనాన్ని పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మల్లెల రవీంద్ర ప్రసాద్ సంబంధిత కార్యదర్శికి మంగళవారం మెమో జారీ చేశారు. గ్రామంలో ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, కార్యాలయ హాజరు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులు, ఆంధ్రప్రభ కథనంలో ప్రస్తావించిన విషయాలను ఎంపీడీవో పరిశీలించినట్లు తెలిసింది.

విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం పట్ల కార్యదర్శిపై ఎంపిడిఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.