అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి వివేక్
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూర్ మండలం లింగంపల్లిలో అమ్మవారి బోనాలకు మంత్రి వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఎసీపీ వెంకటేశ్వర్ లతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. లింగంపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు గ్రామస్తులకు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన సొంత నిధుల నుండి రూ.1 లక్ష అందించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం రూ. 15 లక్షలు కేటాయించి భూమి పూజ చేయడం జరుగుతుందని వెల్లడించారు.
గ్రామంలో 2 బోర్ వెల్ ఏర్పాటుతో పాటు 2 హైమాస్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పారుపల్లి-కోటపల్లి రహదారి నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
