కర్నూలులో ఉద్రిక్తత…
కర్నూలులో ఉద్రిక్తత…
కలెక్టరేట్ ఎదుట టీడీపీ భారీ ధర్నా.
వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బూత్ ఇన్‌చార్జి సునీల్‌పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సంబంధం లేని విషయాల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పేరును లాగుతూ వైసీపీ నాయకులు రాజకీయ లాభాల కోసం కర్నూలులో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రౌడీ మూకలను ప్రోత్సహిస్తూ నగరంలో హింసాత్మక రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ధర్నా కార్యక్రమంతో కొంతసేపు కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.
