పబ్బతి ఆంజనేయుడిని దర్శించుకున్న కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ప్రధాన అర్చకులు వీరయ్య పూర్ణకుంభంతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, యువత విద్య, ఉపాధి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరయ్య ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత, పురాతన వైభవం, నిత్యపూజలు, వార్షిక ఉత్సవాల ప్రాముఖ్యతను కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని తెలిపారు. వేదపండితులు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను సమర్పించారు.

అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఎంపీడీవో సుధాకర్, స్థానిక ఎస్‌ఐ, వివిధ శాఖల అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.