కలెక్టర్ విస్తృత తనిఖీలు

కలెక్టర్ విస్తృత తనిఖీలు
ఎస్టీపీ పనులు వేగవంతం చేయాలని ఆదేశం,
పట్టణ పారిశుధ్యానికి ప్రాధాన్యం..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం..
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, మే 25, ఆంధ్రప్రభ : సోమవారం ఉదయం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, జనగణన ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అధికారులకు పలు సూచనలు చేశారు.
మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రెండు సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ఎస్టీపీలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తనిఖీల సందర్భంగా పట్టణంలోని వెజ్ మరియు నాన్-వెజ్ మార్కెట్లను కూడా పరిశీలించారు. మార్కెట్లలో పరిశుభ్రత, వ్యాపారులకు అందుతున్న సౌకర్యాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. ముఖ్యంగా నాన్-వెజ్ మార్కెట్ భవనాన్ని మున్సిపల్ టౌన్ హాల్‌గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలపై మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డితో చర్చించారు.

ప్రజలకు సామాజిక, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా టౌన్ హాల్‌ను అభివృద్ధి చేయాలని సూచించిన కలెక్టర్, భవనంలో పార్కింగ్ సౌకర్యం, తాగునీటి వసతి, పరిశుభ్రత, సమావేశాల నిర్వహణకు అనువైన హాల్, విద్యుత్ వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి, ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జనగణన సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

