‘మన బడి–మన భవిష్యత్తు’ పనులు పూర్తి చేయాలి..

‘మన బడి–మన భవిష్యత్తు’ పనులు పూర్తి చేయాలి..
868 పాఠశాలల్లో పెండింగ్ పనులపై కలెక్టర్ కఠిన ఆదేశాలు..
రూ. 12.34 కోట్ల నిధులతో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో అమలవుతున్న మన బడి – మన భవిష్యత్తు కార్యక్రమం కింద రెండో విడతలో మంజూరైన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మన బడి – మన భవిష్యత్తు పెండింగ్ పనులపై సంబంధిత ఎంఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన బడి – మన భవిష్యత్తు కార్యక్రమం కింద రెండో విడతలో మంజూరై ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంఈఓలు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో సుమారు 868 పాఠశాలల్లో వివిధ మౌలిక వసతుల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పనుల పూర్తి కోసం దాదాపు రూ. 12.34 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి, పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ముఖ్యంగా పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి సదుపాయం, విద్యుద్దీకరణ వంటి ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమం కింద అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, ఎలిమెంటరీ పాఠశాలల్లో పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను సర్వ శిక్షా అభియాన్ పథకం కింద అమలు చేస్తున్నామని వివరించారు.
పాఠశాలల అభివృద్ధి ద్వారా విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా, విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నరు. కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ లు శంకర్ ప్రసాద్ వెంకటరామిరెడ్డి ఇంజనీరింగ్ అధికారులు ఎంఈవోలు అధికారులు పాల్గొన్నారు.
