Collector | నగర సుందరీకరణకు వేగం…

Collector | నగర సుందరీకరణకు వేగం…

అభివృద్ధి పనులపై కలెక్టర్ కఠిన ఆదేశాలు

Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టి, ప్రతి వీధిని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నాణ్యతతో పాటు సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. బంగారుపేట ప్రధాన కూడలిలో మెరిడియన్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులను సమీక్షిస్తూ, డివైడర్లలో మట్టి ఎగరకుండా గడ్డి పెంచాలని సూచించారు.

కొత్త మొక్కలను నాటి నగరాన్ని పచ్చదనంతో నింపాలని, డివైడర్లకు ఆకర్షణీయమైన పెయింటింగ్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్‌ఆర్‌పేటలో నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన పనులను పరిశీలించిన కలెక్టర్, పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతలో రాజీ పడొద్దని కమిషనర్‌కు సూచించారు. ఉల్చాల వై జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే తరలించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Collector |
Collector |

బళ్లారి చౌరస్తా వద్ద బస్టాండ్‌ను అనుసంధానించే రహదారి పనులను పరిశీలిస్తూ, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పనులను సమయానికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తైతే ట్రాఫిక్ రద్దీ తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. కిడ్స్ వరల్డ్ పార్క్‌ను సందర్శించిన కలెక్టర్, పార్క్ నిర్వహణను మెరుగుపరిస్తే ప్రజల రద్దీ పెరుగుతుందని పేర్కొన్నారు. మే నెలాఖరులోపు పార్క్ నిర్వహణలో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. స్విమ్మింగ్ పూల్ నీటిని శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Collector |

ఆనంద్ థియేటర్ సమీపంలోని కెనాల్ పైభాగంలో ఆర్ట్ పెయింటింగ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, కేసీ కెనాల్‌లోకి చెత్త వేయకుండా ఏర్పాటు చేసిన గ్రిల్స్ పాడైన చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద జరుగుతున్న రహదారి పనులకు సంబంధించిన టీడీఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, నగర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలును పరిశుభ్రమైన, పచ్చని, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేష్, ఎస్‌ఈ రమణమూర్తి, డిప్యూటీ ఇంజనీర్ కృష్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply