బాధితులకు భరోసా కల్పించాలి..
- మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్లను
- తనిఖీ చేసిన డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్
- పెండింగ్ కేసుల పరిష్కారం, సాంకేతికత వినియోగంపై కీలక సూచనలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఫిర్యాదుదారులతో బాధ్యతాయుతంగా వ్యవహరించి, బాధితులకు భరోసా కల్పించాలని డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్, హత్నూర పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించిన డీఐజీ, కేసుల దర్యాప్తు నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఛేదించాలని సూచించారు.
సాంకేతికతను వినియోగించాలి
మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సీసీటీఎన్‌ఎస్–2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి డిజిటల్ అప్లికేషన్లపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, కేసు వివరాలను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని తగిన పరిష్కారం చూపుతామనే భరోసా కల్పించాలని డీఐజీ పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ద్వారా పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.
రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా
స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, బీట్ విధుల్లో అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పాపిలాన్ డివైస్ ద్వారా తనిఖీ చేసి పాత నేరస్తులను గుర్తించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు కేంద్రంగా ఉండటంతో ఆర్థిక, ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక నిఘా అవసరమని తెలిపారు. అధిక నేరాలు నమోదవుతున్న ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించి స్వచ్ఛందంగా కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని ఎస్‌హెచ్‌వోలకు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
