కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైలు భరో: సీఐటీయూ
కార్మిక, రైతు వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
హనుమకొండ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ తెలిపారు.
గురువారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కళావతి అధ్యక్షతన నిర్వహించిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైలు భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.
రాగుల రమేష్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆరోపించారు. కనీస వేతనాల అమలులో జాప్యం జరుగుతోందని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలని, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, పంట బీమా సౌకర్యాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకంలో మార్పులు చేయడం వల్ల గ్రామీణ కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు.
విద్యుత్ రంగానికి సంబంధించిన సవరణలతో రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని, విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు ఎలుకటి అనిల్, ఎం. శారద, పవన్ కళ్యాణ్, సుహాసిని, సాబేరా, సావిత్రి, చెన్ను, రజిత తదితరులు పాల్గొన్నారు.
