పరిశ్రమల అనుమతుల్లో వేగం పెంచాలి..

పరిశ్రమల అనుమతుల్లో వేగం పెంచాలి..
ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త లక్ష్యం
చిత్తూరు – ఆంధ్రప్రభ బ్యూరో :
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే దరఖాస్తులకు పారదర్శకంగా, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఏకగవాక్ష విధానం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, చిన్న–మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు, వివిధ శాఖల అనుమతులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలకు సంబంధించి జిల్లా స్థాయి ప్రీ-స్క్రూటిని కమిటీ 15 క్లెయిమ్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో జనరల్ వర్గానికి 12, ఓబీసీకి 1, ఎస్సీ వర్గానికి 2 క్లెయిమ్‌లు ఉన్నాయని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు, భూముల కేటాయింపు, శిక్షణ కార్యక్రమాలపై గ్రామ, మండల స్థాయిలో అవగాహన పెంచాలని ఆదేశించారు.
“ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం” అని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలు, యువత, కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
నగరి, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో త్వరలో భూసేకరణ చేపట్టి పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. భూముల కేటాయింపును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని చెప్పారు.
పరిశ్రమలు పెరిగితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అనుమతుల జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
