ఓటర్ల జాబితా సవరణలో అర్హులందరికీ హక్కు కల్పించాలి..

ఓటర్ల జాబితా సవరణలో అర్హులందరికీ హక్కు కల్పించాలి..
పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం
భీమవరం – ఆంధ్రప్రభ బ్యూరో :
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
బుధవారం కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో కచ్చితత్వం, సంపూర్ణత పెంపొందించేందుకు పార్టీల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, వారు నమోదు, సవరణలు, తొలగింపుల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ ప్రకారం జూన్ 5 నుంచి 14 వరకు శిక్షణ, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని వెల్లడించారు. జూలై 14న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు, సెప్టెంబర్ 18 వరకు పరిశీలన అనంతరం తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లాలో మొత్తం 14,74,981 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో పురుషులు 7,22,178 మంది, మహిళలు 7,52,723 మంది, ట్రాన్స్‌జెండర్లు 80 మంది ఉన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో నరసాపురం నియోజకవర్గం అత్యధిక శాతం నమోదు చేసిందని తెలిపారు.
అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేసి పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని ఆమె సూచించారు. బీఎల్ఓలు ఇంటింటి పరిశీలనను బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు.
డీఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, ఎన్నికల సెక్షన్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
