పేటలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు..


పేటలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు..

చిలకలూరిపేట ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. అర్బన్ సిఐ పి. రమేష్ పర్యవేక్షణలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, మూడు సవర్ల బంగారు గొలుసును రికవరీ చేశారు.

జనవరి 3న బ్యాంక్ కాలనీకి చెందిన జయరాం విజయలక్ష్మి ఆర్యవైశ్య కళ్యాణ మండపం దర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, హెల్మెట్, మాస్క్ ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు చైన్‌ను లాక్కొని పరారయ్యాడు.

సిఐ పి. రమేష్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అర్బన్ సిఐ పి. రమేష్ పర్యవేక్షణలో ఎస్ఐ, సిబ్బంది కలిసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో షేక్ కృపారావు (A1, ఒంగోలు విజయనగర్ కాలనీ) ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. ఇతనికి కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి (A2) సహకరించినట్లు గుర్తించారు. నంబర్ లేని యూనికాన్ బైక్‌ను కూడా అతనే సమకూర్చినట్లు వెల్లడైంది.

దొంగతనం చేసిన బంగారు చైన్‌ను కనిగిరిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇదే ముఠా కర్ణాటకలోని చిత్రదుర్గ, గౌరిబిదనూరు ప్రాంతాల్లో కూడా చైన్ స్నాచింగ్స్ చేసినట్లు తేలింది.

తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత వీరి కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిఘా పెట్టిన పోలీసులు 25వ తేదీ ఉదయం 10:50 గంటలకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన మూడు సవర్ల బంగారు గొలుసును రికవరీ చేశారు.

నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఘనాపాటి దొంగలు.. సిఐ రమేష్ అభినందనలు

పోలీసు రికార్డుల ప్రకారం A1 కృపారావుపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 36 కేసులు ఉన్నాయి. A2 కొండారెడ్డిపై 41 కేసులు నమోదైనట్లు తెలిసింది. వీరిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందిని సిఐ పి. రమేష్ అభినందించారు.


Leave a Reply