కూలీల సమస్యల పరిష్కారానికి చలో మహబూబ్‌నగర్

కూలీల సమస్యల పరిష్కారానికి చలో మహబూబ్‌నగర్

అచ్చంపేట, జూన్ 17 (ఆంధ్రప్రభ): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ్యా నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామంలో రైతులు, కార్మికులతో కలిసి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ పట్టణంలో జరగనున్నట్లు తెలిపారు. జూన్ 20న నిర్వహించే బహిరంగ సభకు మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. అలాగే తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, బి. వెంకట్, శివదాసన్ తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. మొదటి రోజు మహబూబ్‌నగర్ టౌన్ హాల్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి, జూనియర్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ చేపడతామని తెలిపారు.

జూన్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు మహాసభలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కుదిస్తూ, నరేగా నిధుల్లో కేంద్ర వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందని విమర్శించారు. మిగిలిన 40 శాతం రాష్ట్రాలపై భారం మోపడం వల్ల భవిష్యత్తులో ఉపాధి హామీ చట్టం అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కార్యదర్శి రాములు, రైతు నాయకులు మల్లేష్, రాములు రాజు, నాగయ్య, బక్కయ్య, రేణయ్య, లక్ష్మయ్య, లక్ష్మి, బక్కమ్మ, రేణుక, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.