ఓటర్ సమగ్ర సర్వే అవగాహన సదస్సు..

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ నగరంలోని 39వ డివిజన్ పరిధిలో సింహగిరి, సంజయ్ నగర్, నూర్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ సమగ్ర సర్వే అవగాహన సదస్సు నగరంలోనే తొలిసారిగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ హజీరా బేగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సిరాజ్ ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ముడా చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ BLAలు ప్రతి ఒక్కరూ BLOలతో సమన్వయం చేసుకొని నెల రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల నవీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మీ ఓటు – మీ బాధ్యత అనే నినాదంతో ప్రజలందరూ ముందుకు వచ్చి పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలోనే తొలి కార్యక్రమంగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు డివిజన్ ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ దోమ పరమేష్, తాటికొండ నరసింహ, BLAలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.