పరకాల అభివృద్ధిపై చల్లా ధర్మారెడ్డి ఫైర్
బీఆర్‌ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులకే రంగులు వేసి ప్రారంభోత్సవాలు
100 పడకల ఆసుపత్రిలో పరికరాలు, సిబ్బంది లేకపోవడంపై ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క కొత్త అభివృద్ధి పనినైనా చూపించాలని సవాల్
పరకాల, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో పరకాల ప్రజల ఆకాంక్ష మేరకు మంజూరుచేసి పూర్తి చేసిన 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాలకు రంగులు వేసి,తామే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లలో పరకాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారో ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికీ హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవని, సిబ్బంది నియామకం కూడా కాలేదని అన్నారు. సిబ్బంది నియామకం పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ చేసిన పనులకు రంగులు వేసుకోవడం కాదు.. కాంగ్రెస్ చేసిన ఒక్క కొత్త అభివృద్ధి పనినైనా ప్రజలకు చూపించాలని చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, బిఆర్ఎస్ నాయకులు బొచ్చు బాబురావు, నాయకురాలు గంట కళావతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
