కేడీసీసీ బ్యాంక్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయవాడ (ఆంధ్రప్రభ): కేడీసీసీ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.

వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రైతులు, మహిళలు, పేదలు, గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు కేడీసీసీ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం కేడీసీసీ బ్యాంక్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు విగ్రహానికి నెట్టెం శ్రీ రఘురాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ రంగబాబు, ప్రాంతీయ కార్యాలయ బ్రాంచ్ మేనేజర్ సోమయ్య, బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.