తహసీల్దార్ కార్యాలయంలో మూడుసార్లు వందేమాతరం
స్వాతంత్ర్య వేడుకల్లో గేయాలాపనపై చర్చ
తహసీల్దార్ సతీష్ కుమార్ తీరుపై విమర్శలు
గతంలోనూ జాతీయ పతాకం విషయంలో వివాదం
మక్తల్, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని మూడుసార్లు ఆలపించడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో గేయాలాపనకు సంబంధించి సాధారణంగా పాటించే క్రమానికి భిన్నంగా కార్యక్రమం సాగిందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా విద్యార్థులతో వందేమాతరం గేయాన్ని ఆలపింపజేశారు. అనంతరం జయ జయ తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత మరోసారి వందేమాతరం గీతాన్ని పాడించారు. చివరగా మూడోసారి పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని మైక్ ద్వారా ఆలపించారు. ఈ సమయంలో పలుమార్లు మైక్ మొరాయించడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అనంతరం తహసీల్దార్ సతీష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఒకే కార్యక్రమంలో మూడుసార్లు వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై పలువురు చర్చించుకున్నారు. కార్యక్రమ నిర్వహణ తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జాతీయ పతాకం కర్ర విరిగి జెండా కిందపడిన ఘటన కూడా వివాదాస్పదమైన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వందేమాతరం గీతాన్ని మూడుసార్లు ఆలపించడం చర్చకు దారితీసింది.
