యువకుడు మిస్సీంగ్….

యువకుడు మిస్సీంగ్….

కాల్వలో దూకినట్లు అనుమానం

మాచర్ల, ఆంధ్రప్రభ : ఓ యువకుడు కనిపించకుండా పోగా, అతడు మాచర్ల `జమ్మలమడక రహదారిలో ముంబై బ్రిడ్జి వద్ద సాగర్ కుడి కాల్వలో దూకినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుమారుడు కర్ల ఆంజనేయులు (27) బీటెక్ పూర్తి చేసి, హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకకపోవడంతో, గత ఏడాది నుండి మాచర్లలోని శ్రీ చైతన్య స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు సమాచారం.

సోమవారం తన బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఇదే నా చివరి మాటలు అంటూ భావోద్వేగంగా మాట్లాడినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం కండ్లకుంట గ్రామం నుండి స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి మాచర్లకు వచ్చి, అక్కడి నుండి సాగర్ కుడి కాలువ వద్దకు వెళ్లి మద్యం సేవించి, తన సెల్‌ఫోన్, కర్చీఫ్‌ను అక్కడ వదిలి కనిపించకుండా పోయాడు.

ఈ నేపథ్యంలో అతను కాల్వలో దూకి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ముగ్గురు సంతానం ఉండగా, ఇద్దరు అక్కాచెల్లెళ్ల తర్వాత చివరివాడు ఆంజనేయులు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పట్టణ సీఐ తురకా వెంకటరమణ దర్యాప్తు చేస్తున్నారు.