పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన

పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన

కర్నూలు, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు రెండుసెంట్ల ఇంటి స్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే. రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.


గతంలో నిర్మించిన టిడికో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, రెండుసెంట్ల స్థలం కేటాయించి గృహ నిర్మాణం పూర్తయ్యే వరకు బాడుగ ఇళ్లలో నివసిస్తున్న పేదలకు అద్దెను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. జీవో నెం.23ను సవరిస్తూ, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల రుణ సాయం అందించాలని, ఇప్పటివరకు నిర్మించుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు నివాసానికి కనీస స్థలం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడం సరికాదని విమర్శించారు. పేదలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


ధర్నా అనంతరం కలెక్టరేట్ ఏవో లబ్ధిదారుల వద్దకు చేరుకుని సమస్యలను తెలుసుకుని వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.


ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు మనోహర్, మాణిక్యం, నగర సహాయ కార్యదర్శి సి. మహేష్, దంభోలం శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ, శ్రావణి, నగర కార్యదర్శి భారతి, నాయకులు నాగరాజు, అన్వర్, నల్లన్న, వెంకటేష్, కిట్టు, కుమార్, రామచంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, ప్రజానాట్య మండలి నాయకులు, యువజన సంఘం ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply