జలధార–జలహారతిలో ఏఎస్ఆర్ జిల్లాకు రాష్ట్ర ప్రథమ స్థానం
- మూడు విభాగాల్లోనూ అగ్రస్థానం..
- కలెక్టర్ టి. నిశాంతి నాయకత్వానికి ఫలితం
పాడేరు, ఆంధ్రప్రభ బ్యూరో : జల సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా మూడు కీలక విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
జిల్లా అత్యధిక సంఖ్యలో పనులు చేపట్టడంలో, అత్యధిక నూతన నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించడంలో, జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా అత్యధిక ఆశించిన ఫలితాలను సాధించడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఐఏఎస్ నాయకత్వంలో జిల్లా యంత్రాంగం అనుసరించిన సమర్థవంతమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయిలో ఫలితాల ఆధారిత అమలు విధానం ఈ విజయానికి దోహదపడింది. కార్యక్రమం అమలును కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పనులను సకాలంలో పూర్తి చేయడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు సాధించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వివిధ శాఖల మధ్య సమన్వయం, నిరంతర సమీక్ష, అధికారులకు మార్గనిర్దేశం చేయడం ద్వారా మూడు విభాగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించడంలో కలెక్టర్ నాయకత్వం కీలకంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కలెక్టర్ టి. నిశాంతిని అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేసినందుకు ప్రశంసించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ టి. నిశాంతి మాట్లాడుతూ.. ఈ విజయం అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంబంధిత భాగస్వాముల సమిష్టి కృషి ఫలితమని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేలా అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా నీటి భద్రతను బలోపేతం చేయడంతో పాటు సాగునీటి సామర్థ్యాన్ని పెంపొందించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తూ.. సమన్వయంతో కూడిన, వినూత్నమైన, ఫలితాల ఆధారిత పాలన ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
