Iran-Supreme : వారసుడెవ్వరు,,!? Andhra Ptabha Top Story
Iran-Supreme : వారసుడెవ్వరు,,!? Andhra Ptabha Top Story
- ఆరు నెలల గడిచినా
- ముజ్తుబా జాడ కరవు
- ఆయన ఇక లేనట్టే..
- ఇజ్రాయెల్ వాదన
- ఇరాన్ ఖండన
- వారసత్వం రేసులో ముగ్గురు.
- ప్రపంచంలో ఇరాన్ హాట్ టాపిక్
(ఆంధ్రప్రభ, టెహ్రాన్)
ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ధృవీకరించని నివేదికలు రావడంతో, దేశ వారసత్వ ప్రక్రియపై ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి. ఒకవేళ ఆయన ఇకపై సేవ చేయలేని స్థితిలో ఉంటే, ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యున్నత రాజకీయ మతపర పదవిని ఎవరు చేపట్టగలరనే అంశంసౌ దృష్టి మళ్లింది. టెహ్రాన్ నుండి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఆయన పరిస్థితి “అత్యంత విషమంగా” ఉందని ఇజ్రాయెల్ గట్టిగా చెబుతోంది. .ఫిబ్రవరిలో పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రారంభంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులలో మరణించిన తన తండ్రి అయతోల్లా అలీ ఖమేనీ తర్వాత వారసుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మొజ్తబా ఖమేనీ ప్రజలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఆయన కనపడక పోవటంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది ఇరాన్ రాజ్యాంగ వారసత్వ ప్రక్రియపై ప్రశ్నలను రేకెత్తించింది.ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ధృవీకరించని నివేదికలు వచ్చిన కొద్ది రోజుల తర్వాత, దేశ పాక్షిక – అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ ఆగస్టు 8, శనివారం తేదీ లేని ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, ఈ ఫుటేజీని ఎప్పుడు రికార్డ్ చేశారనేది అస్పష్టంగానే ఉంది, దాని ప్రామాణికతను గానీ, అది ఇటీవలి సంఘటనలను ప్రతిబింబిస్తుందో లేదో గానీ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయారు.
Iran-Supreme : తెరమీదకు తాత్కాలిక మండలి
సర్వోన్నత నాయకుడు తన సేవలను కొనసాగించలేకపోతే ఏమి జరుగుతుంది? సర్వోన్నత నాయకుడి పదవి ఖాళీ అయినప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని ఇరాన్ రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 111 ప్రకారం, సర్వోన్నత నాయకుడు మరణించినా, రాజీనామా చేసినా, పదవి నుండి తప్పించినా లేదా తాత్కాలికంగా తన విధులను నిర్వహించక పోయినా, ఆయన స్థానంలో వారసుడు వచ్చే వరకు ముగ్గురు సభ్యుల తాత్కాలిక నాయకత్వ మండలి బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ , న్యాయవ్యవస్థ అధిపతి ఘోలం – హొస్సేన్ మొహ్సేని-ఎజెయి, ఆర్టికల్ 111లో నిర్దేశించిన ప్రక్రియలో ఎంపిక చేసిన గార్డియన్ కౌన్సిల్ మత న్యాయ నిపుణుడు ఈ తాత్కాలిక మండలి సభ్యులుగా ఉంటారు. వారసత్వ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ మండలి సర్వోన్నత నాయకుడి అధికారాలను వినియోగిస్తుంది.
Iran-Supreme : సుప్రీం నియామకం ఇలా..
ఇరాన్ సర్వోన్నత నాయకుడిని ఎన్నుకునే బాధ్యత 88 మంది సభ్యులు గల నిపుణుల సభపై ఉంటుంది. ఈ పదవి ఖాళీ అయితే, రాజ్యాంగబద్ధంగా సభ వీలైనంత త్వరగా మరొకరిని నియమించాల్సి ఉంటుంది. ఈ పదవికి ఇరాన్ సైన్యం, న్యాయవ్యవస్థ, విదేశాంగ విధానం మరియు ఇతర ప్రధాన ప్రభుత్వ సంస్థలపై విస్తృత అధికారం ఉంటుంది.
Iran-Supreme : వారసులు ఎవరు?
గతంలో పలువురు సీనియర్ మత పెద్దలు రాజకీయ ప్రముఖులను వారసులుగా గుర్తించారు. వారిలో అయతొల్లా అలీరెజా అరాఫీ ఓకరు. . ఈయన ఒక సీనియర్ మత పెద్ద, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు , ఇరాన్ సెమినరీ వ్యవస్థలో ప్రముఖ వ్యక్తి. అలీ ఖమేనీ మరణానంతరం ఏర్పడిన తాత్కాలిక నాయకత్వ మండలిలో కూడా ఆయన పనిచేశారు. తరచుగా ప్రస్తావనకు వచ్చే మరో పేరు అయతొల్లా హషెమ్ హొస్సేనీ బుషెహ్రీ. ఈయన ఖోమ్‌లోని మత సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ మత పెద్ద . నిపుణుల సభలో కీలక పదవులను నిర్వహించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి ఘోలం-హొస్సేన్ మొహ్సేని-ఎజెయి కూడా వారసుడుగా గుర్తింపు పొందారు. ఇరాన్ న్యాయవ్యవస్థ భద్రతా వ్యవస్థలో దశాబ్దాల పాటు పనిచేశారు ఒక కఠినవాదిగా ఆయను భావిస్తారు . ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేని మనవడు హసన్ ఖొమేని పేరు కూడా భవిష్యత్ వారసత్వంపై చర్చలలో వినిపించింది, అయినప్పటికీ ఆయన రాజకీయ వైఖరి పాలకవర్గంలోని అనేక కఠినవాదుల వైఖరికి భిన్నంగా ఉంటుంది.
Iran-Supreme : బహుళ నాయకత్వం వస్తే
ఇరాన్ రాజ్యాంగ చట్రం కూడా కొన్ని పరిస్థితులలో సామూహిక నాయకత్వ ఏర్పాటునకు అవకాశం కల్పిస్తుంది. ఒకే వారసుడిపై నిపుణుల సభ ఏకాభిప్రాయానికి రాలేకపోతే, ప్రత్యామ్నాయంగా ఒక నాయకత్వ మండలి ఏర్పడవచ్చు. అటువంటి చర్య ఇరాన్ సాంప్రదాయ వ్యవస్థ నుండి ఒక ముఖ్య మార్పును సూచిస్తుంది, ఎందుకంటే ఆ వ్యవస్థ ప్రకారం ఒకే సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత రాజకీయ మతపర అధికారాన్ని కలిగి ఉంటారు.
Iran-Supreme : ఐఆర్జీసీ ప్రభావం..
అకస్మాత్తుగా నాయకత్వ శూన్యత ఏర్పడితే, ఇరాన్ యొక్క అత్యంత శక్తివంత సైనిక , రాజకీయ సంస్థలలో కీలక ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్స ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భద్రతా వ్యవస్థ, సైనిక కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే ఐఆర్జీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అనిశ్చితి నెలకున్న తరుణంలో, దేశ రాజకీయ దిశను నిర్దేశించడంలోనూ, భద్రతా యంత్రాంగానికి ఆమోదయోగ్యమైన వారసుడికి మద్దతు ఇవ్వడంలోనూ అది మరింత పెద్ద పాత్రను చేపట్టవచ్చు. ఈ అదనపు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది నాయకత్వ మార్పుకు సంబంధించిన పరిస్థితులు ఇరాన్‌లోని మతపర , రాజకీయ సంస్థల మధ్య అధికార సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.
