వైసీపీ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు: బీద రవిచంద్ర

  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పేరుతో డ్రామాలు
  • పటిష్ట ప్రణాళికతో ముందుకు.. ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం

నెల్లూరు, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆరోపించారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని సంతపేటలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో జిల్లా పరిశీలకుడు, గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు సమన్వయంతో బీద రవిచంద్ర అధ్యక్షతన ఉమ్మడి జిల్లా టీడీపీ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముందు నేతలు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాగు, తాగునీటి సమస్యలు, అధికార యంత్రాంగంతో సమన్వయం, ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలపై అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన అంశాలను చర్చించామని తెలిపారు. సోమశిల, కావలి కాలువల పెండింగ్‌ పనులు, నెల్లూరు రూరల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు, కందుకూరు నియోజకవర్గానికి సోమశిల జలాల సరఫరా, సర్వేపల్లి రైతుల సమస్యలు, వెంకటగిరిలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన అక్రమాలు, కావలి నియోజకవర్గ సాగునీటి అవసరాలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించారని చెప్పారు.

‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గాలపై చర్చించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని బీద రవిచంద్ర తప్పుబట్టారు. డీఎస్సీకి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించినప్పటికీ, అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులే తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ రోడ్డెక్కారని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన వారు.. ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వారిపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీలో ఆందోళన మొదలైందని బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే అంశంలో వైసీపీ నాయకత్వం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

గత ఐదేళ్ల పాలనలో వైసీపీ చేసిన అరాచకాలు, దోపిడీని ప్రజలు మరిచిపోలేదని అన్నారు. సోమశిల జలాశయాన్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. హైలెవల్‌ కెనాల్‌కు ఆనం రామనారాయణరెడ్డి గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారని, టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా సమష్టిగా పనిచేసి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణ ఎన్నికల కంటే మరింత సమర్థంగా పనిచేసి భారీ విజయం సాధిస్తామని బీద రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్యే వెంకటరాజు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.

సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కావ్య కృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.