తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: రైతులు తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి సారించాలని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి పి. వెంకటరమణారెడ్డి సూచించారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో ఆదివారం పంటల వైవిధ్యీకరణ, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున అధిక నీటి అవసరం ఉండే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రభుత్వం గుర్తించిన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుతూ, నీటి పొదుపు పద్ధతులను పాటిస్తే సాగులో నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
వ్యవసాయ శాఖ అందించే సాంకేతిక సలహాలు, సూచనలను రైతులు పాటిస్తూ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని కోరారు.
గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్‌గౌడ్ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటలతో పాటు మునగ సాగు వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ పంటల ఎంపిక, సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల నరసింహ, ఏఈఓ ఎం. శ్రావ్యారెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
