మాజీ సీఎం కారుపై దాడి..

ఆంధ్ర‌ప్ర‌భ‌ : పశ్చిమ బెంగాల్‌లోని హలిసహర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాలపై బురద చల్లడంతో పాటు చెప్పులు, వాటర్‌ బాటిళ్లు విసిరినట్లు సమాచారం.

పోలీసుల అదుపులో మరణించిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హలిసహర్‌ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని, కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్ర గాయాలు అయ్యేవని అన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. కాగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

బిర్జు కియోట్‌ మృతి చుట్టూ వివాదం

పోలీసుల అదుపులో ఉండగా టీఎంసీ కార్యకర్త బిర్జు క్యోత్ మరణించడం రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. అవినీతి, దోపిడీ ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బిర్జు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల అదుపులో అతడిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.