అలర్ట్.. బోనాల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో లాల్‌దర్వాజా బోనాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్‌బౌలి వరకు ప్రధాన మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు.
అలాగే కార్వాన్ దర్బార్ మైసమ్మ, అంబర్పేట్ మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసర ప్రాంతాల్లోనూ అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
బోనాల ఊరేగింపుల సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ఆ మార్గాల్లో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.
