హైదరాబాద్ లో పేలుడు..

  • మియాపూర్‌ జీఎస్‌ఎం మాల్‌ వద్ద ప్రమాదం..
  • జీఎస్‌ఎం మాల్‌ వద్ద నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ మియాపూర్‌లోని జీఎస్‌ఎం మాల్‌ సమీపంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. బెలూన్లలో గ్యాస్‌ నింపేందుకు ఉపయోగించే చిన్న సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఐస్‌క్రీమ్‌ బండి నిర్వాహకుడైన యువకుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిలో కళాశాల విద్యార్థిని, ఐటీ ఉద్యోగి కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న మియాపూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సిలిండర్‌ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సిలిండర్‌ భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మాల్‌ సమీపంలో ఆకస్మికంగా జరిగిన పేలుడుతో స్థానికులు, అక్కడికి వచ్చిన కొనుగోలుదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.