40k-acres : గ‌డ్డి కొర‌త‌కు క‌ళ్లెం Andhra Prabha Exclusive Story

40k-acres : గ‌డ్డి కొర‌త‌కు క‌ళ్లెం Andhra Prabha Exclusive Story

  • క‌ర‌వు జిల్లాలో ముంద‌స్తు క‌స‌ర‌త్తు
  • ప‌శుపోష‌ణ‌పై ఫోక‌స్
  • ఎల్ నినోకు ధీటుగా స‌మాధానం
  • 40,600 ఎకరాల్లో గడ్డి పెంపకం
  • 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
  • 16.44 లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం
  • కూట‌మి స‌ర్కారు ప‌క్కా ప్ర‌ణాళిక

(శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ):

వర్షం లేదు.. పచ్చిమేత లేదు.. పశువులకు దాణా అందడం లేదు.. పాల దిగుబడి పడిపోతోంది.. మరోవైపు పశువులను పోషించేందుకు అయ్యే ఖర్చు మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు పాడి రైతులను మరో సంక్షోభంలోకి నెట్టాయి. ఇప్పటికే పంటల సాగు ప్రశ్నార్థకంగా మారగా.. ఇప్పుడు పశుపోషణ కూడా రైతుకు భారంగా పరిణమిస్తోంది. పశుగ్రాసం కొరత దీర్ఘకాలం కొనసాగితే పాడి పశువుల ఆరోగ్యంతో పాటు రైతుల జీవనోపాధిపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన కూటమి ప్రభుత్వం పశుసంపద పరిరక్షణపై దృష్టి సారించింది. పశుగ్రాసం కొరత తలెత్తకుండా గ్రామస్థాయిలోనే గడ్డి ఉత్పత్తిని పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. రైతులను సామూహిక పశుగ్రాసం పెంపకానికి ప్రోత్సహించడంతో పాటు 75 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది.

40k-acres : వర్షాభావం మేతకు కరువు!

సాధారణంగా వర్షాభావ పరిస్థితులకు గురయ్యే శ్రీ సత్యసాయి జిల్లాలో పశుపోషణ రైతు కుటుంబాలకు అదనపు ఆదాయ వనరుగా ఉంది. పంటలు చేతికందని సమయంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబాలకు కొంతమేర భరోసా కల్పిస్తోంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో పచ్చిమేత అందుబాటులో లేకుండా పోతోంది.

చెరువులు, కుంటలు, వాగులు, జలాశయాలు ఎండిపోవడంతో సహజంగా లభించే పశుగ్రాసం కూడా కరువైంది. దీంతో బయట నుంచి మేత కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పాడి పశువుల దాణా, మేత ధరలు రైతులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగం పశువుల పోషణకే ఖర్చవుతున్న పరిస్థితి నెలకొంది.

40k-acres : పాడి పరిశ్రమకే దెబ్బ!

పశువులకు సరైన మేత అందకపోతే వాటి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మేత కొరత దీర్ఘకాలం కొనసాగితే పశువులు బలహీనపడటం, వ్యాధుల బారిన పడటం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో రైతులకు ఆదాయం తగ్గిపోవడమే కాకుండా పశువుల సంరక్షణ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పశుసంపదను కాపాడుకోవడం అత్యంత కీలకంగా మారింది. రైతులు పశువులను విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.

40k-acres : 40,600 ఎకరాల్లో గడ్డి సాగు…

పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు జిల్లా వ్యాప్తంగా 40,600 ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచే లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న భూములను గుర్తించి సామూహికంగా గడ్డి పెంచేలా రైతులను ప్రోత్సహించనున్నారు.ముఖ్యంగా ఎండిపోయిన చెరువులు, కుంటలు, జలాశయాలు, ఇతర అనువైన ప్రాంతాలను పశుగ్రాసం పెంపకానికి వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ స్థానిక పరిస్థితులకు అనువైన గడ్డి రకాల సాగును ప్రోత్సహించడం ద్వారా పశుగ్రాస ఉత్పత్తిని పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

40k-acres : 16.44 లక్షల టన్నుల మేత లక్ష్యం…

జిల్లాలో చేపట్టనున్న పశుగ్రాసం పెంపకం ద్వారా సుమారు 16.44 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎకరాకు సుమారు 20 కిలోల గడ్డి విత్తనాలను వినియోగించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు పశుగ్రాసం పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. అవసరమైన విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పశుగ్రాసం సాగుపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

40k-acres : 75 శాతం సబ్సిడీతో విత్తనాలు…

రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా 75 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలను పంపిణీ చేయనున్నారు. సామూహికంగా పశుగ్రాసం పెంచే రైతులు, రైతు సమూహాలను ప్రోత్సహించడంతో పాటు గ్రామస్థాయిలోనే మేతను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు సాగనున్నాయి.

40k-acres : సంక్షోభానికి ముందే కళ్లెం!

వర్షాభావం తీవ్రత పెరిగిన తర్వాత మేత కోసం పరుగులు పెట్టడం కంటే ముందుగానే పశుగ్రాసాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పశుగ్రాసం ఉత్పత్తిని పెంచి అవసరమైన సమయంలో రైతులకు అందుబాటులో ఉంచితే పశువుల సంరక్షణకు ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా కాపాడితేనే వర్షాభావ ప్రాంత రైతు కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. అందుకే ప్రస్తుత సంక్షోభంలో పశుసంపద పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

40k-acres : పశువుకు భరోసా!

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పశుగ్రాసం పెంపకం జరిగితే జిల్లాలో మేత కొరతను కొంతమేర అధిగమించే అవకాశం ఉంది. ముఖ్యంగా పాడి రైతులకు బయట నుంచి మేత కొనుగోలు చేసే ఖర్చు తగ్గడంతో పాటు పశువుల ఆరోగ్యం, పాల దిగుబడిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే లక్ష్యానికి అనుగుణంగా భూముల గుర్తింపు, విత్తనాల సకాల పంపిణీ, పశుగ్రాసం సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం, ఉత్పత్తి చేసిన మేతను అవసరమైన ప్రాంతాలకు చేరవేయడం కీలకంగా మారనుంది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతుకు.. పశుగ్రాసం రూపంలో ప్రభుత్వం ముందస్తు భరోసా కల్పించాల్సిన సమయం ఇదే అనేది వాస్తవం