కుప్పకూలిన హెలికాప్టర్‌.. నలుగురు దుర్మరణం

ఆంధ్ర‌ప్ర‌భ : బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. టిజుకా నేషనల్‌ పార్క్‌ వద్ద హెలికాప్టర్‌ అదుపుతప్పి కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.

ఓ బాలిక 15వ పుట్టినరోజు వేడుకల కోసం ఆరుగురు కుటుంబ సభ్యులు టిజుకా నేషనల్‌ పార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు హెలికాప్టర్‌లో విహారయాత్రకు బయలుదేరారు. కొద్దిసేపటికే హెలికాప్టర్‌ అదుపుతప్పి పార్క్‌ ప్రాంతంలోనే కుప్పకూలింది.

హెలికాప్టర్‌ నేలను తాకిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్‌తో పాటు అందులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రతకు నలుగురి మృతదేహాలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.