మయూర దౌత్యం…
- ఐరాస కార్యాలయానికి ఐదు నెమళ్లు బహూకరించిన భారత్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత జాతీయ పక్షి నెమలిని అంతర్జాతీయ వేదికపై సాంస్కృతిక దౌత్యానికి ప్రతీకగా నిలిపేలా భారత్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి భారత్ ఐదు నెమళ్లను బహుమతిగా అందించింది. వీటిలో నాలుగు నీలి నెమళ్లు కాగా.. ఒకటి అరుదైన తెల్ల నెమలి. ఐరాస జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రతిబింబించేలా ఈ ఐదు నెమళ్లను ఎంపిక చేయడం విశేషం.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ నెమళ్లను ఐరాస జెనీవా కార్యాలయ డైరెక్టర్ జనరల్ టటియానా వలోవాయాకు అధికారికంగా అప్పగించారు. ఐరాసతో భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని, బహుపాక్షిక వ్యవస్థపై భారత్‌కు ఉన్న నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెబుతోందని భారత మిషన్ పేర్కొంది.

45 ఏళ్ల క్రితమే ప్రారంభమైన సంప్రదాయం..
జెనీవాలోని ఐరాస కార్యాలయ ప్రాంగణంలో నెమళ్లకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ప్రస్తుత ఐరాస కార్యాలయం ఉన్న ప్రాంతం గతంలో స్విస్ కళా సేకరణకర్త గుస్తావ్ రెవిల్లియోడ్‌కు చెందిన ప్రైవేటు ఎస్టేట్‌గా ఉండేది. అప్పటి నుంచే అక్కడ నెమళ్లు సంచరిస్తుండేవి. 1954లో ఓ నెమలి సోవియట్ ప్రతినిధి బృందం కారుపైకి ఎక్కడంతో ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించిన ఘటన కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీ జంతుప్రదర్శనశాల నుంచి ఒక జత భారతీయ నెమళ్లను జెనీవాలోని ఐరాస కార్యాలయానికి బహుమతిగా పంపించారు. ఇందుకోసం ఆమె స్వయంగా ఉపయోగించే విమానంలో నెమళ్లను పంపించినట్లు ఐరాస వర్గాలు గుర్తుచేశాయి. ఆ తర్వాత కూడా ఐరాస ప్రాంగణంలో నెమళ్లు కనిపిస్తూ వచ్చాయి. తాజాగా 45 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి ఐదు నెమళ్లను పంపింది.
మూడు నెలల పాటు ప్రత్యేక సంరక్షణ
తాజాగా జెనీవాకు చేరిన ఐదు నెమళ్లూ మగవేనని సమాచారం. వీటిలో నాలుగు నీలి నెమళ్లు, ఒక తెల్ల నెమలి ఉన్నాయి. ఐరాస అధికారులు వాటి కోసం తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేశారు. తొలి మూడు నెలల పాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచిన అనంతరం వాటిని జెనీవాలోని అరియానా పార్క్ ప్రాంగణంలో స్వేచ్ఛగా సంచరించేందుకు అనుమతించనున్నారు.
జెనీవా బయోపార్క్‌కు చెందిన పశువైద్య నిపుణుడు డాక్టర్ టోబియాస్ బ్లాహా పర్యవేక్షణలో ఈ నెమళ్ల సంరక్షణ కొనసాగనుంది. కార్యక్రమంలో కొత్తగా వచ్చిన నెమళ్లు ప్రశాంతంగానే ఉన్నాయని ఐరాస అధికారులు తెలిపారు. వాటి కోసం త్వరలో పేర్లను ఎంపిక చేసేందుకు పోటీ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భారత సంస్కృతికి ప్రతీకగా నెమలి
భారతీయ నెమలి శాస్త్రీయ నామం ‘పావో క్రిస్టాటస్’. భారత ఉపఖండానికి చెందిన ఈ పక్షి దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందం, హుందాతనం, వైభవానికి ప్రతీకగా భావించే నెమలికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. చిత్రకళ, వస్త్రాలు, శిల్పాలు, నిర్మాణాలు, సాహిత్యం, మతపరమైన సంప్రదాయాల్లోనూ నెమలి ప్రతిబింబం కనిపిస్తుంది.
భారత జాతీయ పక్షిగా గుర్తింపు పొందిన నెమలిని ఐరాస ప్రాంగణానికి బహుమతిగా అందించడంతో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని భారత్ చాటింది. జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ బాధ్యత పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నెమలి ప్రతీకగా నిలుస్తుందని భారత మిషన్ పేర్కొంది.
“జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి ఐదు ‘పావో క్రిస్టేటస్’ నెమళ్లను బహూకరించడం భారత మిషన్‌కు గొప్ప గౌరవం. భారతదేశం 1981లో కూడా నెమళ్లను బహుమతిగా ఇచ్చింది. ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం ఆనందంగా ఉంది,” అని అరిందమ్ బాగ్చి అన్నారు.
