ఆదివాసీ వేడుకల్లో మెరిసిన ఐఏఎస్, ఐపీఎస్
- సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న కలెక్టర్, ఎస్పీ
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నీతిక పంత్ ఆదివాసీ మహిళల సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి వేడుకలకు హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చుతూ గిరిజన సంస్కృతికి తమ సంఘీభావాన్ని చాటారు.
కార్యక్రమానికి హాజరైన అధికారులకు గిరిజన పెద్దలు, మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కలెక్టర్, ఎస్పీ ఉత్సాహంగా పాల్గొన్నారు.
గిరిజన కళాకారులతో కలిసి అడుగులు వేసిన వారు రేలా పాటలకు నృత్యం చేసి ఆదివాసీ సోదర సోదరీమణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉన్నతాధికారులు తమ సంప్రదాయాలను గౌరవిస్తూ వేడుకల్లో భాగస్వామ్యం కావడం పట్ల ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు.
