Us-Russia-Sanctions-Bill-2026-India-100-Percent-Tariff-Threat | అమెరికా వాణిజ్య యుద్ధం… భారత్‌కు టారిఫ్ ముప్పు!
Us-Russia-Sanctions-Bill-2026-India-100-Percent-Tariff-Threat | అమెరికా వాణిజ్య యుద్ధం… భారత్‌కు టారిఫ్ ముప్పు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లును అమెరికా సెనేట్ 86–11 ఓట్లతో ఆమోదించింది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లభించే అవకాశం ఉంది. భారత్‌పై దీని ప్రభావం ఏమిటి? బిల్లు ఎప్పుడు చట్టమవుతుంది? 100% టారిఫ్ వెంటనే అమల్లోకి వస్తుందా? భారత్, చైనా, రష్యా, అమెరికా వాణిజ్య సంబంధాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది? సమగ్ర విశ్లేషణ…
Us-Russia-Sanctions-Bill-2026-India-100-Percent-Tariff-Threat | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో ప్రధాన లక్ష్యం రష్యా చమురు, గ్యాస్ ద్వారా పొందుతున్న ఆదాయాన్ని తగ్గించడం.
అమెరికా వ్యూహం ఇప్పుడు రష్యాపై నేరుగా ఆంక్షలు విధించడం దగ్గర ఆగడం లేదు. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాస్కో ఆదాయాన్ని తగ్గించాలని చూస్తోంది. తాజా సెనేట్ బిల్లులో ఇదే కీలకమైన అంశం.
86–11.. సెనేట్‌లో మెజారిటీ
Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026ను సెనేట్ 86–11 ఓట్లతో ఆమోదించింది. ఇది ద్వైపాక్షిక మద్దతు ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. అయితే ఈ ఓటుతోనే భారత్‌పై కొత్త సుంకాలు అమల్లోకి వచ్చినట్లు కాదు. సెనేట్ ఆమోదం అనేది చట్ట ప్రక్రియలో ఒక కీలక దశ మాత్రమే.
అసలు టారిఫ్ ముప్పు ఎక్కడుంది?
బిల్లు చట్టమైతే రష్యా చమురు, గ్యాస్‌ను భారీగా కొనుగోలు చేసే కొన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100% వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లభిస్తుంది. ఇక్కడ “100%” అన్నది గరిష్ఠ పరిమితి. అంటే ట్రంప్ తప్పనిసరిగా 100% సుంకం విధించాల్సిన అవసరం లేదు. ఎంత సుంకం విధించాలి, ఎప్పుడు విధించాలి వంటి విషయాల్లో అధ్యక్షుడికి నిర్ణయాధికారం ఉంటుంది.
భారత్ ఎందుకు టార్గెట్లోకి వచ్చింది?
గత కొన్నేళ్లుగా రష్యన్ క్రూడ్‌కు పెద్ద కొనుగోలుదారుగా మారింది. రష్యా నుంచి లభించే ధర ప్రయోజనం, భారత రిఫైనరీల ఆర్థిక లెక్కలు, దేశ ఇంధన భద్రత వంటి కారణాలతో రష్యన్ చమురు భారత దిగుమతి వ్యవస్థలో కీలకంగా మారింది.
అమెరికా లెక్క మాత్రం భిన్నంగా ఉంది. రష్యా చమురును భారత్ కొంటుంది . రష్యాకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం యుద్ధానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొనుగోలుదారులపై కూడా ఒత్తిడి పెంచాలని అమెరికా వ్యూహం.
భారత్‌పై ఎలాంటి ప్రభావం అంటే…
- ఒక భారతీయ కంపెనీ అమెరికాకు $100 విలువైన వస్తువు ఎగుమతి చేస్తే, బిల్లు చట్టమై 100% టారిఫ్ అమలైతే అమెరికా దిగుమతిదారుపై సుంకం $100 వరకు ఉండొచ్చు. అంటే సుంకం కారణంగా అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల ధర పెరగవచ్చు.
- భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది అంటే.. అమెరికా భారతదేశానికి కీలకమైన ఎగుమతి మార్కెట్. భారీ టారిఫ్ అమలైతే భారత ఉత్పత్తులు అమెరికా దిగుమతిదారులకు ఖరీదవుతాయి. దీంతో కొన్ని రంగాల్లో అమెరికా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతికే అవకాశం ఉంది. తద్వారా భారత్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది.
- ఎగుమతులపై ఒత్తిడి పెరిగి విదేశీ మారకద్రవ్య తగ్గితే రూపాయిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భారత్, రష్యా చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించి ఇతర మార్కెట్ల నుంచి చమురు కొనాల్సి వస్తే, ధరలు మరియు సరఫరా పరిస్థితులపై ఆధారపడి భారత దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉంది. అంటే అమెరికా ఒత్తిడి ఎగుమతులపైనే కాదు.. భారత ఎనర్జీ బిల్లుపైనా పరోక్ష ప్రభావం చూపవచ్చు.
భారత్ ఎందుకు రష్యా చమురు కొనుగోలు చేస్తోంది?
భారత్ ప్రధానంగా ఎనర్జీ సెక్యూరిటీని ముందుకు తెస్తోంది. దేశానికి చమురు అవసరం భారీగా ఉంది. ప్రపంచ మార్కెట్లో ఎక్కడి నుంచి తక్కువ ధరకు, స్థిరమైన సరఫరాతో చమురు లభిస్తే అక్కడి నుంచి కొనుగోలు చేయడం భారత ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశం.
రష్యన్ క్రూడ్‌లో ధర ప్రయోజనం లభించినప్పుడు భారత రిఫైనరీలకు అది ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది రష్యాకు రాజకీయ మద్దతు కంటే భారత ఇంధన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయం
అమెరికా మాత్రం ఈ కొనుగోళ్లను రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా చూస్తోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ప్రధాన విభేదం.
అమెరికాలోనూ వ్యతిరేకత ఎందుకు?
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. రష్యాపై కఠిన చర్యలకు మద్దతు ఉన్నప్పటికీ, అధ్యక్షుడికి ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారం ఇవ్వడంపై అమెరికా చట్టసభలోనే అభ్యంతరాలు ఉన్నాయి. హౌస్ సభ్యులు గ్రెగరీ మీక్స్, డాన్ బేయర్ తదితరులు అధ్యక్షుడి టారిఫ్ అధికారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన ఏమిటంటే, అధిక టారిఫ్‌లు విదేశీ దేశాలకే కాకుండా అమెరికా దిగుమతిదారులు, కంపెనీలు, చివరకు వినియోగదారుల ఖర్చులను కూడా పెంచవచ్చు. సెనేట్‌లో టారిఫ్ అధికారాలను తొలగించే సవరణ కూడా తిరస్కరించబడింది.
చట్టం కావాలంటే…
ఇదే కథలో అత్యంత కీలకమైన తదుపరి దశ. చట్టం కావాలంటే.. తొలుత సెనేట్‌లో ఆమోదం పొందాలి. తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమెదం లభించిన తర్వాత అధ్యక్షుడి సంతకం జరగాలి. అప్పుడు చట్టం కాబోతుంది. Reuters ప్రకారం హౌస్ ఆగస్టు 31 తర్వాత తిరిగి సమావేశమయ్యే సమయంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ట్రంప్‌కు తహతహ ఎందుకంటే…
ఈ బిల్లు చట్టమైతే ట్రంప్ చేతిలో మరో వాణిజ్య చర్చల ఆయుధం చేరుతుంది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలతో చర్చలు జరిపేటప్పుడు, రష్యన్ క్రూడ్ కొనుగోళ్లను తగ్గించడం, అమెరికా నుంచి ఇంధన దిగుమతులు పెంచడం, అమెరికన్ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ పెంచడం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలను అమెరికా చర్చల్లో ఉపయోగించవచ్చు. అందుకే ఇది కేవలం “రష్యాపై ఆంక్షల బిల్లు” మాత్రమే కాదు. ఇది భవిష్యత్ అమెరికా వాణిజ్య చర్చల్లో కూడా ఉపయోగించగల ఒక leverage mechanismగా మారే అవకాశం ఉంది.
చైనా అంశం కూడా కీలకమే
భారత్‌తో పాటు చైనా కూడా రష్యా ఇంధనానికి ప్రధాన కొనుగోలుదారుల్లో ఒకటి. అమెరికా ఈ అధికారాన్ని ఉపయోగించి చైనాపై భారీ టారిఫ్ విధిస్తే, బీజింగ్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉంటుంది. అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలు చేపడితే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఈ బిల్లు US–Russia సంబంధాలకే పరిమితం కాకుండా US–China, US–India సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఇదీ అమెరికా లెక్కలు
రష్యన్ చమురు కొనుగోలుదారులు తగ్గితే రష్యాకు చమురు ఆదాయం తగ్గుతుంది. అప్పుడు యుద్ధ యుద్ధ వ్యయాలపై ప్రభావం పడుతుంది. అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది.
భారత్‌తో బేరానికి అమెరికా రావొచ్చు!
భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు రావొచ్చు. భారత్–అమెరికా మధ్య చర్చల్లో ఈ అంశం ఒక బేరసారాల అంశంగా మారవచ్చు. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూనే అమెరికాతో ఎనర్జీ ట్రేడ్, మార్కెట్ యాక్సెస్, దిగుమతులు, ఎగుమతులు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తదితరులు అంశాలపై చర్చించవచ్చు.
అంటే టారిఫ్ ముప్పు ఒకవైపు ఒత్తిడి అయితే, మరోవైపు దౌత్యపరమైన చర్చలకు అవకాశం కూడా.
