నిరుద్యోగుల పక్షాన వైసీపీ న్యాయ పోరాటం..

  • రేపు నందికొట్కూరులో ‘ఏపీ జోన్ వార్ భారీ ర్యాలీ

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక పరీక్షలో చేసిన భారీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ ఏపీ జోన్ వార్ పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది.అందులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డా. దారా సుధీర్ ఆధ్వర్యంలో సోమవారం, ఆగస్టు పదవ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై అంబేద్కర్ కూడలి వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ సందర్భంగా డా. దారా సుధీర్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామక పరీక్షలో అక్రమాలకు పాల్పడి వేలాది మంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు అండగా వైసీపీ ఎల్లప్పుడూ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు చేపట్టిన ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు విద్యార్థి, యువత నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.