9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష..

9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : పెద్దవంగర మండల పరిధిలో 2017లో జరిగిన భార్యను హత్య చేసిన భర్త కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దవంగర మండల పరిధిలోని గంట్లకుంట గ్రామానికి చెందిన చింతల రేణుక – యాకయ్య దంపతులు గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

యాకయ్య తన భార్య ప్రవర్తన పై అనుమానంతో వేధింపులకు గురి చేస్తూ, భార్యతో గొడవపడి టవల్ తో ఉరి వేసి హత్య చేశాడు. మృతురాలి తల్లి పడమటింటి సోమనర్సమ్మ ఫిర్యాదు మేరకు కొడకండ్ల పోలీస్ స్టేషన్ లో 2017 జనవరి 27న కేసు నమోదు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం గురువారం నిందితునికి పదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు.