కేర్ మెడికల్ కాలేజీ పీజీ విభాగ డీన్‌గా డాక్టర్ మెహబూబ్ షేక్

యాజమాన్యం పదోన్నతితో బాధ్యతల స్వీకారం
ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ రంగంలో 25 ఏళ్ల విశేష అనుభవం
వైద్య విద్యాభివృద్ధికి మరింత సేవలందిస్తానని డీన్ ఆశాభావం

విజయవాడ, ఆంధ్రప్రభ : కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పీజీ స్టడీస్ డీన్‌గా ప్రొఫెసర్ డాక్టర్ మెహబూబ్ షేక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగాధిపతిగా సేవలందిస్తున్న ఆయన ప్రతిభ, అనుభవాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం ఈ పదోన్నతిని కల్పించింది. వైద్య విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ మెహబూబ్ షేక్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించారు. గత 25 సంవత్సరాలుగా దేశ, విదేశాల్లో నిర్వహించిన అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైద్య సదస్సుల్లో పాల్గొని పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు.

వైద్య విద్య, పరిశోధన, శస్త్రచికిత్స రంగాల్లో ఆయన చేసిన సేవలు విశేష గుర్తింపు పొందాయి. పీజీ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధనలకు ప్రోత్సాహం, వైద్య విద్యలో నాణ్యతాభివృద్ధికి డాక్టర్ మెహబూబ్ షేక్ నాయకత్వం మరింత ఉపయోగపడుతుందని కళాశాల యాజమాన్యం అభిప్రాయపడింది. డీన్‌గా నియమితులైన డాక్టర్ మెహబూబ్ షేక్‌కు కళాశాల యాజమాన్యం, సహచర ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.