ఓటు మన హక్కు – ఆ హక్కును కాపాడుకుందాం

2వ డివిజన్‌ కుమ్మరి బజార్‌లో ‘సర్‌’
జరుగుతున్న పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ : ఓటు మన హక్కు అని ఆ హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు సహకరించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్‌ కుమ్మరి బజార్‌ ఏరియాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న తీరును ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు అని తెలిపారు. ఆ హక్కును పొందడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు సరిచూసుకుని బీఎల్‌వోలు అడిగిన సమాచారం అందచేయాలని సూచించారు.

చిరునామా మారిన వారి వివరాలు, మరణించిన వారి పేర్లతో పాటుగా ఒకటికి మించి పేర్లు ఉన్నవారి వివరాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు సహకరించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండాలని, ఒక్క అనర్హుడి పేరు కూడా ఓటరు జాబితాలో ఉండకూడదని చెప్పారు. ఓటు మన హక్కు అని, ఆ హక్కును కాపాడుకుందామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు.