Mothkur రక్తదాతలను ప్రోత్సహించిన వారికి గవర్నర్ అవార్డులు
Mothkur రక్తదాతలను ప్రోత్సహించిన వారికి గవర్నర్ అవార్డులు
రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపు..
హైదరాబాద్ రాజభవన్లో రాష్ట్ర స్థాయి సత్కారం
మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలను ప్రోత్సహించడంలో విశిష్ట సేవలు అందించిన వారికి గవర్నర్ అవార్డులు లభించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజభవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో వీరిని సత్కరించారు.
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. అత్యధిక రక్తదాతలను ప్రోత్సహించిన డాక్టర్ చల్లా జయశ్రీ, అలాగే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ బి. వినోద్ కుమార్కు అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించి ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడుతున్న రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. మత్తు పదార్థాల రహిత సమాజం, టీబీ రహిత భారత్ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పేదలు ఎక్కువగా టీబీతో బాధపడుతున్నారని, వారికి ఆర్థిక సహాయం అందించి రోగ విముక్తికి తోడ్పడాలని గవర్నర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ (ఐఏఎస్), పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్, జనరల్ సెక్రటరీ శ్రీరాములు, ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల మహేందర్ రెడ్డి, డివిజన్ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
