ఎద్దుల బండితో కాటసాని నిరసన..
ఎద్దుల బండితో కాటసాని నిరసన..
ఇంధన ధరలు తగ్గించాలని వైసీపీ డిమాండ్
కల్లూరు, ఆంధ్రప్రభ : పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం కల్లూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఎద్దుల బండిపై ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగిన ఈ నిరసన ర్యాలీ స్థానికుల దృష్టిని ఆకర్షించింది. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
