250 points | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

250 points | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ‘బ్లాక్ మండే’ పరిస్థితులు కనిపించాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం ప్రభావంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొనడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇరాన్ సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాపై భయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు దిగారు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌కు డిమాండ్ అధికమవడంతో భారత రూపాయి విలువ భారీగా క్షీణించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.96.32కు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ లో నమోదైంది. చమురు దిగుమతుల ఖర్చులు పెరగడం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుపై కూడా ఆలోచించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.