హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. ఇది ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనమంటూ వారు విమర్శలు గుప్పించారు.
ఈనేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు. “గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునేవారని నేను అన్నాను. ఆ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించే నేను ఆ వ్యాఖ్యలు చేశాను” అని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని, ఈ అంశంపై త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు.