Counter | రేవంత్​ది అబ‌ద్దాల ప్ర‌భుత్వం – అస‌త్యాల‌తోనే పరిపాల‌న‌: కిషన్ రెడ్డి

ఏడాదిలోనే ప్ర‌జ‌ల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త‌
కుల గ‌ణ‌న సర్వే అంతా తప్పుల త‌డ‌క
కాంగ్రెస్ పాల‌నపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆగ్రహం

నల్గొండ, ఆంధ్ర‌ప్ర‌భ:
గత ప్రభుత్వం మీద పదేళ్లకు వ్యతిరేకత వస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ పాలన మీద ఏడాదికే వ్యతిరేకత మొదలైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తమ్ రెడ్డి గెలుపు కోరుతూ శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నిరంత‌రం అబ‌ద్దాల‌తోనే రేవంత్ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని, అందుకే ఏడాదిలోపే ప్ర‌జ‌ల్లో అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నార‌ని అన్నారు. కుల గ‌ణ‌న స‌ర్వేతో బీసీల‌కు అన్యాయం జ‌రిగింద‌ని, తాము ప్ర‌శ్నిస్తే, దానికి స‌మాధానం చెప్ప‌కుండా మోదీ కులం ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం ఏంట‌ని నిల‌దీశారు.

మూడు స్థానాలు గెల‌వాల్సిందే..

రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు సరోత్తమ్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డి పోటీలో ఉన్నారని.. వారిని ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని కేంద్రమంత్రి తెలిపారు. గతంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేవారని, ప్రస్తుతం ప్రభుత్వానికి సలామ్ కొడుతున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *