Anantapur వైసీపీ–టీడీపీ శ్రేణుల ఘర్షణ

Anantapur వైసీపీ–టీడీపీ శ్రేణుల ఘర్షణ

బస్సులపై దాడి ఘటనను ఖండించిన నారా లోకేష్

అనంతపురం (Anantapur), ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. టీడీపీ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో ప్రయాణిస్తూ వెళ్తుండగా వెదురుపల్లి సమీపంలో వారి వాహనాలను అడ్డుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు బస్సుల్లో వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కురుగుంట సమీపంలో దాడి జరిగిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రేరేపణతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు బస్సులపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటన విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సందేశం పంపి ఘటనను తీవ్రంగా ఖండించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించకుండా గుర్తించి రౌండప్ చేయాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు.

Leave a Reply