యువకుడి అనుమానాస్పద మృతి

యువకుడి అనుమానాస్పద మృతి

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డు చర్చి సమీపంలో రాత్రి యువకుని అనుమాదస్పద మృతితో కలకలం రేపింది. నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్ షరీఫుద్దీన్ (35) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ ఘటన పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మృతుడి మృతి వెనుక ఉన్న అసలు కారణాల పై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మమ్మద్ షరీఫుద్దీన్ భార్య ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శిగా చిట్యాల మండలంలోనీ కైలాపూర్ లో విధులు నిర్వహిస్తోంది. ఉద్యోగ రీత్యా భార్య, భర్త మూడు నెలల పసికందుతో కలిసి పరకాలలో అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో షరీఫుద్దీన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ మాట్లాడిన అనంతరం బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన షరీఫుద్దీన్ తిరిగి ఇంటికి రాలేదని భార్య మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది.”నా భర్తకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎవరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత బయటకు వెళ్లి తిరిగి రాకపోవడం మాకు తీవ్ర ఆందోళన కలిగించింది” అంటూ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షరీఫుద్దీన్ మృతి సహజంగా జరిగిందని తాము నమ్మడం లేదని, ఇది ముమ్మాటికీ హత్యే అయ్యి ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు. మృతుడికి ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వాలు లేకపోయినా, అతను బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం వెనుక ఏదో కుట్ర దాగి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ ఎవరు చేశారు? ఎక్కడికి పిలిచారు? ఎవరిని కలిసేందుకు వెళ్లాడు? చివరిసారిగా అతనితో మాట్లాడిన వ్యక్తులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తేనే ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనతో పట్టణంతో పాటు చర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు నెలల పసికందును, భార్యను వదిలి షరీఫుద్దీన్ అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు పోలీసు అధికారులు జోక్యం చేసుకుని కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి మృతికి గల అసలు కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. షరీఫుద్దీన్ మృతి వెనుక ఏవైనా అనుమానాస్పద అంశాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి, మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.