ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో విద్యుత్ అక్రమాలు?
- సెరికల్చర్ మీటర్లతో మూడు నెలలుగా విద్యుత్ వినియోగం..
- చర్యలకు సిద్ధమైన విద్యుత్ శాఖ
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో విద్యుత్ వినియోగానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. నిర్మాణ పనుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా, సెరికల్చర్ శాఖకు చెందిన విద్యుత్ మీటర్లను మూడు నెలలుగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు అధికారిక ప్రారంభోత్సవానికి ముందే ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, పనులు అంతకుముందే కొనసాగినట్లు తెలుస్తోంది.
విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏ నిర్మాణ సంస్థ అయినా పనులు ప్రారంభించే ముందు ప్రత్యేకంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని, శాఖ మంజూరు చేసిన మీటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే విద్యుత్ వినియోగించాలి. అయితే ఈ ప్రాజెక్టులో సెరికల్చర్ శాఖకు చెందిన ఒక త్రీ-ఫేజ్, ఒక సింగిల్-ఫేజ్ మీటర్ల ద్వారా నిర్మాణ పనులకు విద్యుత్ వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిర్మాణ పనుల్లో నీటి సరఫరా, రాడ్ బెండింగ్, ఇతర విద్యుత్ ఆధారిత పనులకు ఈ మీటర్లనే వినియోగించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. నిర్మాణ ప్రాంగణంలో జనరేటర్ ఏర్పాటు చేసినప్పటికీ, వాస్తవానికి ఇతర శాఖకు చెందిన మీటర్ల నుంచే విద్యుత్ వినియోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సెరికల్చర్ శాఖకు చెందిన సుమారు 20 ఎకరాల భూమిని విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. అయితే భూమి బదిలీ జరిగినప్పటికీ, ఆ శాఖకు చెందిన విద్యుత్ కనెక్షన్లను నిర్మాణ పనులకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్, లైన్మెన్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్ విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన డీడీలు చెల్లించిన విషయం నిజమేనని, అయితే కొత్త మీటర్ మంజూరు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని గుర్తించారు. కొత్త మీటర్ ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ వినియోగించకుండా వేచి ఉండాల్సి ఉండగా, ముందుగానే విద్యుత్ వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు.





