దొడ్డి కొమురయ్య త్యాగం యువతకు స్ఫూర్తి..

  • కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.

దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.