జుక్కల్ లో ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : సామాజిక,సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని జుక్కల్ మండలానికి చెందిన పలువురు వక్తలు, ప్రజాప్రతినిధులు కొనియాడారు.ఆదివారం నాడు జుక్కల్ మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో బసవేశ్వర చౌక్ వరకు ఊరేగింపు నిర్వహించారు.అనంతరం మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి,ప్రత్యేక ప్రార్థన నిర్వహించడమే కాకుండా హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శివుడు ఒక్కడే,కులమతలు ఒక్కటే అన్న నినాదంతో కులమత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని కులాల వారికి సమానత్వం కల్పించి సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు బసవేశ్వరుడని వారన్నారు. బడుగుబలహీన వర్గాల వారికి అండగా ఉంటూ మూఢచారాలను, మూఢనమ్మకాలను పాల ద్రోలి,స్త్రీలకు సమానత్వాన్ని కల్పించడం జరిగిందన్నారు.

మంచిని పెంచుతూ,చెడును తుంచుతూ ముందుకు సాగిన బసవేశ్వరుడు లింగాయత్ ధర్మన్నీ ఏర్పాటు చేసి, లింగాయత్ ధర్మం ఒక జీవన విధానమని,ఈధర్మంలో సేవ తాత్పర్యం తప్ప కులమత ధనిక,పేద విచక్షణ లేదని చాటిచెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడని వారు కొనియాడారు.ఈసందర్భంగా మిఠాయి పంపకం చేశారు.ఈ జయంతి ఉత్సవాలు మండలమే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు,మాజీ ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,యువకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.