పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తా..

పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తా..

  • సబ్బితం గౌరి గుండాల జలపాతానికి రూ. 6 కోట్లు
  • పెద్దపల్లి ప్రాంతాలను ఆహ్లాదకరంగా మారుస్తాం..
  • ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామంలో రూ. 43 లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా సబ్బితం జలపాతం నిలిచిందని, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం సమీపంలో గట్టు సింగారం కొండల నుండి ఉద్భవించి, వర్షాకాలంలో (జులై నుండి నవంబర్ వరకు) ఆకట్టుకునేలా ప్రవహిస్తుందన్నారు. పెద్దపల్లి నుండి 15 కి.మీ దూరంలో ఉన్న జలపాతం, స్థానికంగా గౌరీ గుండాలుగా పిలవబడుతూ, దట్టమైన అటవీ ప్రాంతంలో సందర్శకులను ఆకర్షింస్తోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లతో జలపాతం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

గత పాలకులు ఈ జలపాతాన్ని ఎన్ని సార్లు సందర్శించిన తట్టెడు మట్టికూడా తీసిన పాపాన పోలేదని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను శాసనసభ్యునిగా ఎన్ని కైన తర్వాత రూ. 6 కోట్లు వెచ్చించి అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అవసరమైతే జలపాతం అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చూపిస్తామని తెలిపారు. సబ్బితం జలపాతం వర్షాకాలంలో గట్టుసింగారం కొండల నుండి నీరు ఉప్పొంగి ప్రవహించడంతో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుందని, సందర్శించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారని తెలిపారు.

వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకంగా ఆహ్లాదకరంగా తీర్చేందుకు జలపాతాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారీ అవుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్ చేసి ముడి సరుకులు తయారు చేసి టైల్స్, దారం వాటికి ఉపయోగిస్తారని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, ఈ యూనిట్ వలన పర్యావరణ కాలుష్యం తగ్గి పరిశుభ్రత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్, పర్యాటక అధికారులు, గ్రామ సర్పంచులు, కొమ్ము సుజాత, నూనె సరోజన, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, మార్కెట్ చెర్మన్ కూర మల్ల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply