పోలీసులపై సీఎం ఫుల్ ఫోకస్.. శాంతిభద్రతలపై హైలెవెల్ మీటింగ్ !

  • పోలీస్ స్టేషన్లకు కొత్త టార్గెట్ !

ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయం నుంచి పోలీసు శాఖ ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయి అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు అధికారులు ఒకే వేదికపై పాల్గొనడం ఈ సమీక్షలో ప్రత్యేకతగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయి నుంచి సమీక్షించిన సీఎం.. ప్రజల్లో పోలీసులపై మరింత విశ్వాసం పెరిగేలా వ్యవస్థ పనిచేయాలని సూచించినట్లు సమాచారం. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్ లక్ష్యంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి అధికారులు..

సీఎం నిర్వహించిన సమీక్షకు హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్‌హెచ్‌ఓలు సహా వివిధ స్థాయిలకు చెందిన సుమారు 1,650 మంది అధికారులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. పోలీసు యంత్రాంగం మొత్తం ఒకేసారి సమీక్షలో పాల్గొనడం ద్వారా శాంతిభద్రతల అంశంపై ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమైంది.

పోలీస్ స్టేషన్ అంటే కేవలం కేసులు నమోదు చేసే కేంద్రం కాదని.. ప్రజలకు భద్రత, న్యాయం అందించే తొలి వేదికగా పనిచేయాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిస్థితి, నిందితులపై తీసుకుంటున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగితే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థంగా సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు..

రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏ వర్గానికి చెందిన వారైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజల్లో భయాందోళనలు కలిగించే ఘటనలను ప్రారంభ దశలోనే నియంత్రించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. హిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి దర్యాప్తు వరకు ప్రతి దశలో పోలీసులు వేగంగా, సున్నితంగా స్పందించాలని సూచించినట్లు సమాచారం. పాఠశాలలు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా..

సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

యువతను ప్రభావితం చేస్తున్న బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కూడా సీఎం సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌లను గుర్తించి మూలాలను ఛేదించాలని, సరఫరాదారులతో పాటు వాటి వెనుక ఉన్న వ్యవస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు చెక్..

సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలు, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే సమాచారంపై నిఘా పెంచాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అయితే చట్టబద్ధమైన భావ వ్యక్తీకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్‌పై మాత్రమే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు వ్యవస్థ వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించడం లక్ష్యంగా పోలీసింగ్ వ్యవస్థలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఈ సమీక్ష స్పష్టం చేస్తోంది.

కేసుల నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేయడం, నిందితులను గుర్తించడం, చార్జిషీట్లు దాఖలు చేయడం వరకు ప్రతి దశలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యను వినే విధానం నుంచి.. కేసు పరిష్కారం అయ్యే వరకు పోలీసు వ్యవస్థలో ప్రతి ఒక్కరి బాధ్యత స్పష్టంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

క్షేత్రస్థాయిలోనే పోలీసింగ్ బలోపేతం..

పోలీసులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంచడం, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడం, స్థానిక పరిస్థితులపై నిరంతర సమాచారం సేకరించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఎస్‌హెచ్‌ఓ తన పరిధిలోని పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని.. తమ పరిధిలో నేరాల నియంత్రణకు బాధ్యత వహించాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నియంత్రణ, మహిళలు–చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల కట్టడి, మాదకద్రవ్యాల నియంత్రణ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై చర్యలు వంటి అంశాలపై సీఎం సమగ్ర దిశానిర్దేశం చేశారు. డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒకే సమీక్షలో భాగస్వామ్యం చేయడం ద్వారా పోలీసింగ్ వ్యవస్థపై ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ కొనసాగించనున్న సంకేతాలు ఇచ్చింది. స్టేషన్ స్థాయిలో పనితీరు మెరుగుపడితేనే ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరుగుతుందనే లక్ష్యంతో.. క్షేత్రస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం ఆదేశాలు ఇచ్చారు.