లోకేశ్‌కు యువత అండ… విజయవాడలో ‘ జన్ జెడ్ గర్జన!

  • టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
  • కదం తొక్కిన విద్యార్థులు, యువత
  • ‘నారా లోకేశ్‌కు అండగా మేమంతా’ అంటూ నినాదాలు
  • మెగా డీఎస్సీపై జగన్‌ విమర్శలకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కౌంటర్‌
  • విద్యార్థుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టీకరణ

విజయవాడ, ఆంధ్రప్రభ: యువత, విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అండగా నిలుస్తున్నారంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. జన్ జెడ్ విత్ లోకేష్ ’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘నారా లోకేశ్‌కు అండగా మేమంతా’ అంటూ నినాదాలు చేస్తూ నగర వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చరణ్‌సాయి యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో యువతకు డీఎస్సీ నిర్వహించలేదని, ఇప్పుడు డీఎస్సీపై వైసీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నారా లోకేశ్‌కు యువతలో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే వైసీపీ డీఎస్సీ అంశాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు.

16 వేల ఉద్యోగాలపై రచ్చ ఎందుకు?..

మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని చరణ్‌సాయి యాదవ్‌ పేర్కొన్నారు. అభ్యర్థులు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించారని, డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, అభ్యర్థులు అక్రమాలు జరగలేదని చెబుతున్నప్పటికీ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జన్ జెడ్ పేరుతో వృద్ధులను టెంట్ల కింద కూర్చోబెట్టి దీక్షలు చేయించడం వైసీపీ రాజకీయ వైఖరికి నిదర్శనమని చరణ్‌సాయి యాదవ్‌ విమర్శించారు. అసలైన యువత బలం ఏమిటో విజయవాడలో నిర్వహించిన ర్యాలీ ద్వారా చూపించామని అన్నారు. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు.

ఆధారాలు ఉంటే బయటపెట్టండి..

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వాటిని ఆధారాలతో నిరూపించే ధైర్యం ఉందా అని చరణ్‌సాయి యాదవ్‌ ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, నారా లోకేశ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా విద్యార్థులు, యువతకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం నారా లోకేశ్‌ చేస్తున్న కృషికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అండగా ఉంటుందని చరణ్‌సాయి యాదవ్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు పొట్లూరు దర్శిత్, జిల్లా నాయకులు దాడి మురళి, లోకల్‌ సాయి, వడ్లమూడి వంశీచౌదరి, సెంట్రల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బంగారపు సతీష్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మోడీ వెంకట్రాజు, మణికంఠ, నాయకులు రవి, యువ కిషోర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.