అమరావతి ప్రాజెక్టులపై కీలక చర్చ

  • రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
  • విశాఖ ఏనుగుల దినోత్సవ వేడుకలపై చర్చ
  • కేంద్ర మంత్రి భూపేందర్‌ సింగ్‌ యాదవ్‌ రాక

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో గురువారం జరగనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రిని మంత్రి ఆహ్వానించారు.

అమరావతి రాజధాని పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారాయణను పవన్ కళ్యాణ్ అభినందించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ప్రాజెక్టుతో అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.

ఇదిలా ఉండగా, గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తన అభ్యర్థన మేరకే ఈ వేడుకలను విశాఖలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

తన ఆహ్వానం మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ సింగ్‌ యాదవ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.