నంబర్‌వన్‌ స్థానమే లక్ష్యం కాదు.. నిలబెట్టుకోవడమే సంకల్పం!

  • ప్రథమ స్థానంలో నిలిపేందుకు సిబ్బంది సమష్టి కృషి
  • భక్తుల సంతృప్తే విజయానికి కొలమానం..
  • సేవల్లో ఎక్కడ రాజీ వద్దు
  • ఎన్ని లక్షల మంది వచ్చినా ప్రశాంత దర్శనం కల్పించాలి
  • ఆషాఢ సారె విజయవంతానికి ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు
  • రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
  • సమన్వయంతో అందరం కలిసి పని చేద్దాం
  • దుర్గమ్మ ఆలయ ప్రతిష్ఠ మరింత పెంచుదాం
  • దుర్గగుడి ఈవో శీనా నాయక్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: భక్తులకు అందిస్తున్న సేవల్లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రతి ఉద్యోగి, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్‌ అన్నారు. ఆషాఢ సారె ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థానం తరఫున కనకదుర్గమ్మకు సారె సమర్పించిన అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

సిబ్బంది కృషి అనిర్వచనియం..

దేవస్థానం సేవల్లో ప్రథమ స్థానాన్ని సాధించేందుకు ఏడాదిగా సిబ్బంది, వైదిక, ఇంజనీరింగ్‌, ఇతర విభాగాలు సమన్వయంతో కష్టపడ్డాయని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. ఈ స్థాయిని సాధించడం ఎంత ముఖ్యమో.. భక్తుల నుంచి వచ్చే సంతృప్తికరమైన స్పందనతో ఆ స్థానాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆషాఢ సారె సందర్భంగా రాత్రింబవళ్లు విధులు నిర్వహించి లక్షలాది మంది భక్తులకు సేవలందించిన ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శీనా నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సేవ చేసే అవకాశం లభించడం ప్రతి ఒక్కరి అదృష్టమని, ఆ భావనతోనే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

భక్తుల సంతృప్తే కొలమానం..

ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎంత పెరిగినా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన దర్శనం, సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈవో శీనా నాయక్ సూచించారు. భక్తులు సంతృప్తిగా అమ్మవారిని దర్శించుకుని క్షేమంగా స్వస్థలాలకు చేరి ఇంద్రకీలాద్రి సేవలను ప్రశంసించేలా ప్రతి ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఆలయంలోని ప్రతి విభాగం సమష్టిగా పనిచేస్తేనే నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకోగలమని పేర్కొన్న ఈవో.. సిబ్బంది మధ్య సానుకూల దృక్పథం, పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

భక్తుల నుంచి వచ్చే స్పందనను నిరంతరం పరిశీలిస్తూ, లోపాలను సరిదిద్దుకుంటూ సేవల నాణ్యతను మరింత పెంచాలని సూచించారు. ఆషాఢ సారె ఉత్సవాలను విజయవంతం చేసిన వైదిక బృందం, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసు, ఇతర విభాగాల సహకారాన్ని ఈవో అభినందించారు. భవిష్యత్‌లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇదే సమష్టి స్ఫూర్తితో నిర్వహించి దుర్గమ్మ ఆలయానికి దక్కిన ప్రథమ స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.